సౌర విద్యుత్తు వినియోగం ద్వారా ప్రజలకు గణనీయమైన ఆర్థిక లాభాలు కలుగుతాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఇంజనీర్లకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణా తరగతులలో ఆయన పాల్గొన్నారు.
‘పీఎం సూర్యఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకంపై రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC), జాతీయ విద్యుత్ శిక్షణా సంస్థ (NPTI), బెంగళూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
డైరెక్టర్ వెంకట సుబ్బయ్య, విద్యుత్ శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఇంజనీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ కూడా హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఇళ్లపై లేదా ఖాళీ వ్యవసాయ భూములపై సౌర ప్యానెల్లు ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లులు తగ్గి, గ్రిడ్‌కు కనెక్ట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం 317 సౌర నెట్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయని, ఈ సంఖ్యను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
అలాగే భవిష్యత్తులో ఇంధన నిల్వలు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం వంటి సమస్యలకు సౌర విద్యుత్తే ప్రధాన ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించి, గృహాలపై సౌర ప్యానెల్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ మాట్లాడుతూ, సౌర ప్యానెల్లు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని వివరించారు. 1 కిలోవాటుకు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు రూ.78,000 సబ్సిడీ అందుతుందని తెలిపారు. సుమారు 300 యూనిట్లు వినియోగించే కుటుంబానికి సంవత్సరానికి దాదాపు రూ.20,000 వరకు ఆదా అవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఏ.ఓ. జయరాజ్, డీ.ఈ. గణేష్, రాంబాబు, లక్ష్మీనారాయణ రెడ్డి, సబ్ డివిజన్ల ఏ.డీ.ఈ లు, సెక్షన్ ఏ.ఈ లు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
0 కామెంట్లు